Pages

Monday 21 January 2019

JEEVANA VEDAM

జీవన వేదం
                                                    
                                                   -డా. యస్. విజయ్ కుమార్

          జీవనం అంటే జీవిత విధానం, వేదం అంటే విజ్ఞానం (Knowledge). జీవితాలను సార్థకం చేసుకోవడానికి కావలసిన విజ్ఞానాన్ని సంపాదించుకోవడమే జీవన వేదం అంటారు. నేడు జీవితమంటే, ఇంద్రియ సుఖాలను అనుభవించడమే అన్నభావన యువతలో బాగా నాటుకుపోయింది. భావాలు నుండి బయటకు రావాలి. ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం అల్ప మైందని, శాశ్వతం కాదని గ్రహించాలి. ఇంద్రియాలకు మనసుకుబుద్ధికి ఆవల ఉన్న పరమాత్మను తెలుసుకోవడం వలన శాశ్వత ఆనందాన్ని పొందగలమని మన మహర్షులు చెప్పిన నగ్నసత్యం అర్థం చేసుకోవాలి.  స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను ఇంద్రియార్థాల నుండి మరల్చుకో గలడు. ఇంద్రియాలకు స్వేచ్ఛను ఇవ్వడమే మన బలహీనత, ఇంద్రియాల నుండి స్వేచ్ఛను పొందడం వల్ల శారీరక బలం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. విచ్చలవిడితనం మితిమీరుతున్న నేటి కాలంలో యువత ఇంద్రియనిగ్రహాన్ని హాస్యాస్పదంగా భావిస్తున్నది. అంతర్జాలం (Internet), ప్రసార మాధ్యమాల ద్వారా ఈనాటి యువత వారి ఇంద్రియ సామర్థ్యాలను ఎంతగానో దుర్వినియోగం చేస్తున్నారు. ఇంద్రియ నిగ్రహం పాటించడం వల్ల మానవుడి వ్యక్తిత్వం బలపడుతుంది. కారణం ఏమంటే, ఇంద్రియాల ద్వారా వృధా అయిపోతున్న శక్తిసామర్థ్యాలు ఇంద్రియ నిగ్రహం వల్ల ప్రోగవుతాయి. వాటిని సరైన దారిలో అంటే, నిర్మాణాత్మకమైన, ఉన్నతమైన కార్యకలాపాలలో ఉపయోగిస్తే విజయం సాధించవచ్చు. విధంగా చేయడం వల్ల యువతలో జ్ఞాపకశక్తి, వివేకం, విచక్షణా జ్ఞానం పెరుగుతాయి.
            అంతర్జాలం, ప్రసార మాధ్యమాలను - టీవీ, సోషల్ మీడియా అంటే యూట్యూబ్ (YouTube),  ఫెస్ బుక్ (Face book), మొదలైన వాటిల్లో ఎక్కువగా కాలం దుర్వినియోగం చేస్తూ వాటి మాయలో పడిపోతున్నారు. దీనివల్ల, వారి భవిష్యత్ తో పాటు దేశ భవిష్యత్తును కూడా  పణ్ణంగా పెడుతున్నారు. నేడు యువత ఇంద్రియ లోత్వానికి గురి అవుతున్నారు. కన్ను ఒక ఇంద్రియం, కన్ను అనే ఇంద్రియానికి ఇంద్రియార్థం రూపం. చెవి ఒక ఇంద్రియం, దానికి ఇంద్రియార్థం శబ్దం. నాలుక అనే ఇంద్రియానికి ఇంద్రియార్థం రుచి. ముక్కు కు వాసన. చర్మానికి స్పర్శ ఇంద్రియార్థం. ఈనాటి యువత అంతర్జాలం, ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్నా వింటున్నా అనవసర, అపరిమిత విషయ సేకరణ ద్వారా మనస్సును కలుషితం చేసుకుంటున్నప్పుడు వారు విధంగా జ్ఞాననిష్ఠులు కాగలరు? "సర్వేంద్రియానాం నయనం ప్రధానం". కావున, "కండ్లు వెళ్లిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు". కళ్లెం లేని గుర్రం, బ్రేకులు లేని వాహనం ప్రమాదకరం. కావున, ఇంద్రియాలను అదుపు చేయని వారి జీవితం కూడా అంతే ప్రమాదకరం. ఇంద్రియాలపై అదుపు సాధించగలిగితే ఎవరికి వారు విజయం సాధించినట్లే. తాబేలు తన అంగాలను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఎవరైతే, తమ ఇంద్రియాలను విషయ వస్తువుల నుండి ఉపసంహరించుకుంటారో, అట్టి వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. మనకు వస్తువులపై ఉన్న అత్యంత ఆసక్తి ఈనాటి పర్యావరణ హానికి కారణం అవుతున్నది. గిరాకి (Demand)  పెరగడంతో వస్తువులను అధికంగా ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. మన దైనందిన జీవితంలో వివేకంతో కూడిన వినియోగతత్వం (Consumerism) లేకపోవడం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతున్నది. ఉదాహరణకు మనదేశం లో ఎక్కువమంది అవసరమున్నా లేకున్నా కార్లను కొనడం వల్ల మరియు ప్రజా రవాణా (Public Transport) అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల అధికంగా వాహన కాలుష్యం ఏర్పడి పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతున్నది. నేటి యువత, మేము శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధిని సాధించాం, మాకు ఆధ్యాత్మిక జ్ఞానం తో ఏం అవసరమున్నదని వారి వాదన. అలనాడు, స్వామి వివేకానంద మరియు మహాత్మా గాంధీ బోధనతోపాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరించి చూపించారు. “ఇంద్రియ వ్యవస్థను అదుపులో ఉంచుకోవడం ద్వారా జాతీయ పునాదిని సంరక్షించుకో గలం. పవిత్రత అనే పునాది కనుక నాశనమైతే జాతీయ విధానం కుప్పకూలిపోతుందని స్వామి వివేకానంద హెచ్చరించారు”. నేడు ఇంద్రియనిగ్రహం పాటించడం సన్యాసులకే పరిమితమని యువత వాపోతున్నారు. కానీ అది సర్వమానవాళి సుఖ జీవనానికి మార్గదర్శక  సూత్రమని విస్మరిస్తున్నారు. స్వామి వివేకానంద రచించిన "చూడామణి" అనే గ్రంథంలో శ్రవణేంద్రియం (బోయవాని వేణుగానం) చేత లేడీ, స్పర్శ ఇంద్రియం (ఆడ ఏనుగు స్పర్శ) చేత ఏనుగు, నయనేద్రియం (మంట) చేత మిడుత, రనేంద్రియం (ఎర యొక్క రుచి) చేత చేప, ఘ్రాణేంద్రియం (చంపక పుష్ప పరిమళం) చేత తుమ్మెద ప్రేరేపించబడి బంధాలలో చిక్కుకుని ప్రాణాలను కోల్పోతున్నాయి. ఒక ఇంద్రియం పై నిగ్రహం లేకుండా ఉన్నా, ఓటికుండ నుండి నీరంతా ఒలికి పోయినట్లు విచక్షణా జ్ఞానం అంతా కొట్టుకుపోతుంది. మరిక ఐదు ఇంద్రియాలకు (కండ్లు ముక్కు, చెవి, నాలుక, చర్మం అంటే స్పర్శ) దాసుడైన మనిషి పరిస్థితి గురించి ఇక చెప్పనే అవసరం లేదు. అంటే, ఇంద్రియాల మాయలో పడితే మనిషి బతుకు అధోగతే. యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో అత్యుత్తమమైనవి సాధించి కీర్తిని గడించాలని ఈనాటి యువత గ్రహించాలి. దీని అర్థం, యవ్వనంలో కోరికలను అణచు కొమ్మని కాదు, కానీ వాటి యొక్క అవసరాలను అర్థం చేసుకొని విచక్షణ ఉపయోగించాలి, వాటిల్లోని లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. ఉదాహరణకు మిఠాయి తినాలనే కోరికను బలవంతంగా అణచుకుంటే  ఎలాగైనా తినాలనిపిస్తుంది. కానీ అందులోని దోషాలను తెలుసుకుంటే లేదా ఆరోగ్యానికి అది కలిగించే నష్టాన్ని చక్కగా అవగాహన చేసుకుంటే క్రమంగా దానిపై విజయాన్ని సాధించ వచ్చు. ఇంద్రియ నిగ్రహంతో పాటు మనిషికి మనోనిగ్రహం కూడా అవసరం. మనిషి విషయాలపట్ల, అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, మానవమానాలు మొదలైన వాటి గూర్చి సదా చింతించడం వల్ల వాటిపట్ల ఆసక్తి పుడుతుంది, ఒకవేళ వస్తువును తాను పొందలేకపోతే లేదా కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోపోద్రేకుడైన మనిషి ఒక విధమైన సమ్మోహానికి లోనై విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. దీనివల్ల, అతని బుద్ధి నశించి వివేకాన్ని కోల్పోతాడు. వివేకాన్నికోల్పోవడం వల్ల మనిషి సంపూర్ణంగా పతనమవుతాడు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో శ్లోకం ద్వారా తెలియజేయడం జరిగింది -       
                             
                         ద్యాయ తో విషయాన్ పుంసః  సంగస్తేషుపజాయతే
                      సంగాత్ సంజాతయే కామః కామాత్ క్రోధోభిజాయతే ।।
                      క్రోధాదృవతి సమ్మోహః సమోహాత్ స్మృతి విభ్రమః
                      స్మృతి భ్రంశాత్ బుద్ది నాశో, బుద్ది నాశాత్ ప్రణశ్యతి ।।
              
               ఒక దేశం యొక్క భవిష్యత్తు దేశ యువతపై ఆధారపడి ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి, యువత ఇంద్రియలోలు కాకుండా, వారు స్వామి వివేకానంద చెప్పినట్లు ఉక్కు కండరములతో దేహదారుఢ్యం కలిగి వారి ఆశయాలను నేర్చుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేయాల్సి ఉంటుంది (Arise, Awake and stop not until the goal is achieved). చివరగా, అందరూ స్థితప్రజ్ఞులు కావడానికి ప్రయత్నించాలి. అంటే, సుఖాలు, విజయాలు వరించినప్పుడు పొంగిపోకుండా, దుఃఖాలు, అపజయాలు, కష్టాలు, నష్టాలు, అవాంతరాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, ఇంద్రియాలను తమ అదుపులో ఉంచుకొని   అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు అవిశ్రాంతంగా కృషి చేయాలి.

No comments:

Post a Comment