Pages

Thursday 5 May 2022

వేదాలు - ఉపనిషత్తులు (VEDAS AND UPANISHADS)

వేదం అనగా 'జ్ఞానం' అని అర్ధం. కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వ్యాసుడు, వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు. వేదాలు నాలుగు: 1. ఋగ్వేదము 2. యజుర్వేదము 3. సామవేదము 4. అధర్వణవేదము. వేదాలకు (1). శ్రుతి, (2). అనుశ్రవం, (3). త్రయి, (4). సమమ్నాయము, (5). నిగమము, (6). ఆమ్నాయము, (7). స్వాధ్యాయం, (8). ఆగమం, (9). నిగమం అని తొమ్మిది పేర్లున్నాయి. 1. శ్రుతి - గురువు ఉచ్చరించినదాన్ని విని అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు. 2. అనుశ్రవం - గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు. 3. త్రయి - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములను కలిపి "త్రయి" అని పేరు. 4. సమమ్నాయము - ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి. 5. నిగమము - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి. యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు. 6. ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య. 7. స్వాధ్యాయం - స్వాధ్యాయం అంటే—స్వ అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం 8. ఆగమం - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి. 9. నిగమం - యాస్కుడు నిగమము అని వ్యవహరించాడు. వ్యాసుడు వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు అంటారు, కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు). మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి: 1. మంత్ర సంహిత 2. బ్రాహ్మణము 3. ఆరణ్యకము 4. ఉపనిషత్తులు (ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు). 1. మంత్ర సంహిత: “సంహిత" అంటే మంత్రాల సంకలనం. నాలుగు వేదాలకు నాలుగు సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే. అంటే మంత్రాల సముదాయం. ఋక్సంహితలోని మంత్రాలను ఋక్కులు అంటారు. యజుర్వేదంలో యజుస్సులు, సామవేదంలో సామాలు, అధర్వవేదంలో అంగిరస్‌లు అనబడే మంత్రాలుంటాయి. యజ్ఞంలో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు. ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని "హోత" అని, యజుర్మంత్రాలు పఠించే ఋషిని "అధ్వర్యుడు" అని, సామగానం చేసే ఋషిని "ఉద్గాత" అని, అధర్వాంగిరస్సులను పఠించే ఋషిని "బ్రహ్మ" అని అంటారు. ఈ నలుగురూ యజ్ఞ వేదికకు నాలుగు వైపుల ఉంటారు. వేద సంహితలలో యజుస్సంహితలో మాత్రమే గద్యభాగం ఎక్కువగా ఉంది. ఋక్సంహిత, సామ సంహిత పూర్తిగా గద్యభాగమే అయినా వాటిని కూడా మంత్రాలలా పఠిస్తారు. 2. బ్రాహ్మణము: బ్రాహ్మణము ఒక వేదభాగము. ఇది ప్రతి వేదంలో ఉంటుంది. ఇది సంహిత యొక్క యాగవినియోగవ్యాఖ్య. ఈ భాగములో మహా యాగముల గూర్చి తెలపడం జరిగింది. అశ్వమేధము వంటి యాగముల ప్రశస్తి వివరించడం జరిగింది. యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి? వాటి వెనుక రహస్యాలు ఏమిటి వంటి విషయాలు ఉన్నాయి. 3. ఆరణ్యకము: అరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణములకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి అరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ప్రతి సంహితలు బ్రాహ్మణాలున్నట్లే అరణ్యకాలు కూడా ఉండేవి. కాలాలు గడిచే కొద్దీ ప్రజల నిరాదరణకు గురై చాలా వరకు నశించి పోయాయి. అథర్వవేదానికి చెందిన గోపథబ్రాహ్మణం అనే బ్రాహ్మణానికి సంబంధించిన అరణ్యకం లేకపోవడము ఇందుకు తార్కాణం. 4. ఉపనిషత్తులు: ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు. వేదాలు: 1. ఋగ్వేదం: ఇది అత్యంత పురాతనమైన వేదము. ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. ఋగ్వేదం అష్టకాలు, మండలాలు అనే విభాగాలతో కూడి వున్నది. అష్టకాలలో అధ్యాయాలు, అధ్యాయలలో వర్గాలూ ఉంటాయి. మండలాలలో అనువాకాలూ, అనువాకాలలో సూక్తాలు వుంటాయి. మొత్తం 1017 సూక్తాలు 10,580 ఋక్కులు 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి. అవి 1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన. వీటిలో మొదటిదైన శాకల తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు. ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాథలు తెలుపుతాయి. దీనిలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించబడింది. ఋగ్వేదం కామితార్థాలను తీర్చే వేదంగా పరిగణిస్తారు. వర్షాలు పడాలంటే పర్జన్య సూక్తాలు పఠించాలని సూచింపబడింది. "ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వత" అనే సూక్త పఠనం మానవులను దీర్ఘాయుష్కులను చేస్తుందని నమ్ముతారు. శంకరాచార్యులు ఋగ్వేదాన్ని ప్రశంసించారు. 2. యజుర్వేదము: యజుర్వేద మంత్రాలు రెండు భాగాలు. ఒకటి శుక్ల యజుర్వేదం, రెండవది కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదానికి వాజ సనేయ సంహిత అనే పేరు కూడా ఉంది. వాజసని అంటే సూర్యుడు. సూర్యుడి నుంచి యాజ్ఞవల్క్య ముని గ్రహించినది గనుక వాజసనేయం అనే పేరు వచ్చింది. వేద విభజన చేసిన వ్యాసుడి నుంచి వైశం పాయనుడు యజుర్వేదం నేర్చుకొన్నాడు. వైశంపాయనుడి నుంచి యాజ్ఞవల్క్యుడు తెలుసుకొన్నాడు. కాని, వైశంపాయనుడికీ, యాజ్ఞవల్క్యుడికీ మధ్య ఏదో వివాదం రావడం వల్ల యాజ్ఞవల్క్యుడు తాను నేర్చిన వేదాన్ని వదలి వేయవలసి వచ్చింది. (మంత్రాలను కక్కవలసి వచ్చిందనీ, అలా కక్కిన మంత్రాలను దేవతలు తిత్తిరి పక్షుల రూపంలో వచ్చి తినివేశారనీ ఒక కథ ఉంది. కక్కిన మంత్రాలు నల్లగా ఉండటం వల్ల వాటి సంహితకు కృష్ణ యజుర్వేదం అనే పేరు వచ్చిందంటారు. ఏదో ఒక గూఢార్థంతో ఈ కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. యాజ్ఞవల్క్యుడు వదలు కొన్నప్పటికీ ఆయన నుంచి అప్పటికే తెలుసుకొని ఉన్న కొందరు శిష్యులు వాటిని భద్రపరచి ఉంటారు. నేర్చుకొన్నది పోయినందుకు బాధపడిన యాజ్ఞవల్క్యుడు సూర్యుడిని ఉపాసించి తిరిగి యజుర్వేదాన్ని సంపాదించాడు. అదే శుక్ల యజుర్వేదం. (శుక్ల అంటే తెలుపు. కృష్ణ అంటే నలుపు.) యజుర్వేదం అలా రెండు శాఖలుగా వ్యాప్తిలోకి వచ్చింది. వైశంపాయనుడు నేర్పినది కృష్ణ యజుర్వేదమని, సూర్యుడు చెప్పినది శుక్ల యజుర్వేదమని రెండు శాఖలు వాడుకలోకి వచ్చాయి. యజుర్వేదం అనే శబ్దం యజుస్‌, వేదం అనే రెండు పదాల కలయిక. యజుస్‌ శబ్దం యజ్‌ అనే ధాతువు నుంచి ఏర్పడింది. యజ్ఞం అనే శబ్దమూ యజ్‌ నుంచి వచ్చినదే. యజ్‌ అంటే ఆరాధించడం, పూజించడం లాంటి అర్థాలు ఉన్నాయి. కర్మకాండను తెలియజేసే మంత్రాలు యజుస్సులు. యజ్ఞాలు ఎలా జరగాలో ఈ మంత్రాల వల్ల తెలుస్తుంది. యజుర్వేద మంత్రాలు సాధారణంగా గద్యరూపంలోనే ఉంటాయి. (ఋక్‌ పాదబద్ధా, గీతంతు సామ, గద్యం యజుర్మంత్రః) బ్రాహ్మణాలతో కలసిన యజుర్వేద మంత్రాలు యజుర్వేద సంహిత. శుక్ల యజుర్వేదంలో మాధ్యందిన సంహిత, కణ్వ సంహితలు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలో సంహిత, బ్రాహ్మణ భాగాల విభజన కనిపించదు. స్పష్టత లేకపోవడమే కృష్ణ శబ్దం (చీకటి) పొందడానికి కారణమై ఉండవచ్చునని ఒక అభిప్రాయం. కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ, కఠ, మైత్రాయణీ శాఖలు ఉన్నాయి. 3. సామవేదము : సామం అనగా మధురమైనది. ఇది యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది. నాలుగు వేదాల క్రమంలో మూడవది. దీనిని వేద వ్యాసుడు జైమిని మహర్షికి బోధించాడు. సామవేదంలో 1875 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ప్రత్యేకమైన ఛందస్సు ఉంది. సామవేదంలోని 1875 మంత్రాలలో చాలావరకు ఋగ్వేద సంహితలో ఉన్న 10,552 మంత్రాలలోనుండి యధాతధంగా తీసుకొనబడ్డాయి. ఈ సారూప్యం పాఠానికి మాత్రమే వర్తిస్తుంది. ఉచ్ఛారణా విధానం మాత్రం సామవేదంలో వేరుగా ఉంటుంది. భగవద్గీతలో "వేదములలో నేను సామమును" అని కృష్ణుడు చెప్పడాన్ని బట్టి సామవేదానికి ఉన్న ప్రాముఖ్యతను ఊహించవచ్చును. సామవేద సంహితకు మూడు శాఖలున్నాయి. వాటిలో కౌతుమీయ శాఖ గుజరాత్‌లో ప్రాచుర్యంలో ఉంది. జైమినీయ శాఖ కర్ణాటక ప్రాంతంలోను, రాహయణీయ శాఖ మహారాష్ట్ర ప్రాంతంలోను ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో కౌతుమీయ, రాహయనీయ శాఖలలో మంత్రాలు, ఉచ్ఛారణావిధానం ఒకటే కాని మంత్రాల క్రమంలో తేడా ఉంది. జైమినీయ శాఖలో 1693 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. కాని ఇందులో ఎక్కువ గానాలు (3681) ఉన్నాయి. సామవేదం ఒక్కొక్క అధ్యాయంలోను ఋగ్వేదంలోని ఒక్కొక్క మండలంనుండి మంత్రాలు గ్రహించబడ్డాయి. ఒక్కొక్క అధ్యాయం ఒకో దేవత గురించి ఒకో ఛందస్సులో కీర్తిస్తుంది. ఉదాహరణకు సామవేదం మొదటి అధ్యాయంలో 11 మంత్రాలున్నాయి. వీటిలో 10 మంత్రాలు ఋగ్వేదంలోనివే. 11వ సామవేద మంత్రం మాత్రం ఋగ్వేదంలో కనిపించదు. ఋగ్వేదంలో పేర్కొన్న దేవతల పేర్లే సామవేదంలో పేర్కొనబడ్డాయి. కాని "పవమాన సోముడు" గురించిన స్తోత్రాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. 4.అధర్వణవేదం: చతుర్వేదాలలో నాలుగవది. అధర్వణ ఋషి పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. ఋగ్వేదంలానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించడం ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి. వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది . రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా బాణాలకు విషం పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.

No comments:

Post a Comment